2022 సంవత్సరానికిగాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులను 2022 డిసెంబర్ 22న ఢిల్లీలో ప్రకటించారు. తెలుగు విభాగంలో ప్రముఖ రచయిత మధురాంతకం నరేంద్రను కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వరించింది. దక్షిణ భారతదేశంలో వందేళ్లకు పూర్వం ఉన్న దేవదాసీల వ్యవస్థ, ఆ వ్యవస్థ పెరుగుదల, క్షీణత, దేవదాసీలుగా ఉండి ప్రముఖులైన మహిళల జీవితాలపై విశ్లేషణాత్మకంగా నరేంద్ర రాసిన 'మనోధర్మపరాగం' నవల ఈ అవార్డుకు ఎంపికైంది. మరో రచయిత, కవి వారాల ఆనంద్కు సాహిత్య అకాడమీ అనువాద విభాగంలో అవార్డు లభించింది. ప్రకృతి వర్ణనలతో ప్రముఖ కవి గుల్జార్ హిందీలో రాసిన 'గ్రీన్ పోయెమ్స్'ను వారాల ఆనంద్ 'ఆకుపచ్చ కవితలు'గా అనువదించారు. దీనికే అనువాద పురస్కారం దక్కింది. హిందీలో 'తుమీ కీ శబ్ద్' కవితా సంకలనానికి బద్రీ నారాయణ్, 'ఆల్ ది లైవ్స్ వియ్ లివ్డ్' ఆంగ్ల నవలకు గాను అనూరాధ రాయ్, 'ఖ్వాబ్ సరబ్' ఉర్దూ నవలా రచయిత అనిస్ అష్ఫల్, తమిళ నవల 'కాలాపానీ' రచయిత ఎం. రాజేంద్రన్లు కూడా పురస్కారాలకు ఎంపికయ్యారు. అవార్డు గ్రహీతలకు రూ. లక్ష నగదు, తామ్ర ఫలకం, శాలువా, జ్ఞాపిక ప్రదానం చేస్తారు. అనువాద పురస్కారం కింద రూ.50 వేల నగదు, తామ్ర ఫలకం, శాలువా, జ్ఞాపిక బహూకరిస్తారు.
No comments:
Post a Comment