Previous Questions

TSPSC & APPSC Special

Youtube

Previous Papers

TSPSC MP3

SSC MTS Previous Asked Questions

SSC MTS Quant

SSC General Awareness Previous Asked Questions

Just Fun

Geography

Indian History

General Awareness MCQ

Study Material

Quicker Maths

Banks Clerk Quant

Group II

Reasoning (Verbal & Non verbal)

Quantitative Aptitude

TS Group I Video Tutorials

Saturday, 21 January 2023

లోక్సభ & దాని విధులు

లోక్‌సభ: లోక్‌సభ(Loksabha)ను దిగువ సభ అని కూడా అంటారు. లోక్‌సభ సభ్యులను ప్రజలే ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు.

ప్రస్తుతం లోక్‌సభలో 545 మంది సభ్యులు ఉన్నారు – వీరిలో 530 మంది రాష్ట్రాల నుండి, కేంద్రపాలిత ప్రాంతాల నుండి 13 మంది, ఇద్దరు నామినేట్ చెయ్యబడ్డ ఆంగ్లో ఇండియన్ సభ్యులు ఉన్నారు.

లోక్‌సభ సభ్యులను ఎన్నుకునేందుకు జరిగే ఎన్నికలను సార్వత్రిక ఎన్నికలు (General Elections) అంటారు. వోటర్ల సంఖ్య రీత్యా, ఎన్నికల పరిమాణం రీత్యా భారత సార్వత్రిక ఎన్నికలు ప్రపంచంలోనే అత్యంత భారీ ఎన్నికలు.

లోక్‌సభ సభ్యుడికి కావాల్సిన అర్హతలు

భారతీయ పౌరుడై ఉండాలి.
25 ఏళ్ల కంటే ఎక్కువ వయసు ఉండాలి.
ప్రభుత్వ ఉద్యోగం/పదవిలో ఉండకూడదు.
ఎటువంటి నేరారోపణలు ఉండకూడదు.
దేశంలో ఏదో ఒక నియోజకవర్గంలో ఓటరుగా నమోదై ఉండాలి.
పోటీ చేసే అభ్యర్థి నామినేషన్ పత్రంతో పాటు రూ.25,000 ధరావతు చెల్లించాలి. (ఎస్సీ, ఎస్టీలకు రూ.12,500).
అభ్యర్థి తన ఆస్తులు, అప్పులు, ఇతర వివరాలను తప్పనిసరిగా అఫిడవిట్ రూపంలో తెలియజేయాలి.

పదవీ కాలం

లోక్‌సభ సాధారణ పదవీ కాల వ్యవధి 5 ఏళ్లు(ప్రకరణ 83(2) ప్రకారం).
జాతీయ అత్యవసర పరిస్థితి అమల్లో ఉన్నప్పుడు ఏడాది వరకు పొడిగించొచ్చు. అదే రద్దయిన తర్వాత ఆరు నెలల కంటే ఎక్కువ కాలం పొడిగించడానికి వీల్లేదు.
అలాగే రాజకీయ అనిశ్చితి నెలకొన్నప్పుడు 5 ఏళ్ల కంటే ముందే లోక్‌సభను రద్దు చేయొచ్చు(ప్రకరణ 85 ప్రకారం).

రాజీనామా

పార్లమెంటు సభ్యులు తమ రాజీనామా పత్రాన్ని సంబంధిత సభాధ్యక్షులకు సమర్పించాలి. ఉదాహరణకు లోక్‌సభ సభ్యులైతే స్పీకర్‌కు, రాజ్యసభ సభ్యులైతే రాజ్యసభ చైర్మన్‌కు తమ రాజీనామా పత్రాలను వ్యక్తిగతంగా ఇవ్వాలి. ఆ రాజీనామాను స్వచ్ఛందంగా చేశారా? లేదా? అని విచారించిన తర్వాతే సభాధ్యక్షులు ఆమోదిస్తారు.
పార్లమెంటు సభ్యులు సభాధ్యక్షుల అనుమతి లేకుండా నిరవధికంగా 60రోజులు గైర్హాజరైతే సభ్యత్వం కోల్పోతారు.
సభ్యులు ఏక కాలంలో రెండు సభల్లో సభ్యత్వం కలిగి ఉంటే ఏదైనా ఒక సభలో సభ్యత్వం కోల్పోతారు.
రాజ్యసభ, లోక్‌సభకు ఒకేసారి ఎన్నికైతే ఎన్నికైన పదిరోజుల్లోపు తన అభీష్టాన్ని తెలియజేయాలి. లేదంటే రాజ్యసభలో సభ్యత్వం రద్దవుతుంది.
అప్పటికే ఒక సభలో సభ్యునిగా ఉండి మరో సభకు ఎన్నికైతే మొదట సభ్యునిగా ఉన్న సభలో సభ్యత్వం రద్దవుతుంది.
ఒక అభ్యర్థి రెండు స్థానాల్లో పోటీచేసి రెండిటిలోనూ గెలిచి నిర్ణీత గడువులో (10 రోజులు) తన ఐచ్ఛికాన్ని తెలపకపోతే రెండు స్థానాల్లోనూ తన సభ్యత్వం కోల్పోతాడు.
రాష్ట్ర శాసనసభకు, పార్లమెంటుకు ఒకేసారి ఎన్నికైతే 14 రోజుల్లో రాష్ట్ర శాసన సభ్యత్వానికి రాజీనామా చేయాలి. లేని పక్షంలో పార్లమెంటు సభ్యత్వం రద్దవుతంది.
పార్లమెంటు సభ్యుని ఎన్నిక చెల్లదని హైకోర్టు తీర్పు చెప్పినప్పుడు, సభ్యుడు ఆ సభతో బహిష్కరణకు గురైనప్పుడు, పార్లమెంటు సభ్యులు.. రాష్ట్రపతి లేదా ఉపరాష్ట్రపతిగా ఎన్నికైనప్పుడు, గవర్నర్‌గా నియమితులైనప్పుడు. ఇతర కారణాల వల్ల అనర్హుడిగా ప్రకటించినప్పుడు పార్లమెంట్‌లో ఖాళీలు ఏర్పడతాయి.

సభా నిర్వహణ

స్పీకర్ లోక్‌సభా నిర్వహణ బాధ్యతను నిర్వహిస్తారు. సభ్యులు తమలో ఒకరిని స్పీకర్‌గా ఎన్నుకుంటారు. స్పీకర్‌కు సహాయంగా ఒక డిప్యూటీ స్పీకర్‌ను కూడా ఎనుకుంటారు. సార్వత్రిక ఎన్నికల తరువాత సభ్యుల ప్రమాణ స్వీకారంతో లోక్‌సభ ఏర్పాటు అవుతుంది. ప్రమాణ స్వీకార కార్యక్రమ నిర్వహణ కొరకు తాత్కాలికంగా సభ్యులలో ఒకరిని అనగా ఒక అనుభవజ్ఞుడైన స్పీకరును ఎంచుకుంటారు. ఆపై స్పీకరు ఎన్నిక జరుగుతుంది. సభా నిర్వహణ బాధ్యతలు పూర్తిగా స్పీకరు నిర్వహిస్తారు.

లోక్ సభ స్పీకర్ & డిప్యూటీ స్పీకర్

1) లోక్‌సభ చీఫ్ ప్రిసైడింగ్ ఆఫీసర్.

2) సభా సమావేశాలకు స్పీకర్ అధ్యక్షత వహిస్తారు & సభ కార్యకలాపాలపై అతని తీర్పులు తుది తీర్పులు

3) స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్ కు 14 రోజుల ముందస్తు నోటీసు తరువాత సభలో సమర్థవంతమైన మెజారిటీ ఆమోదించిన తీర్మానం ద్వారా వారి కార్యాలయాల నుండి తొలగించబడతారు.

స్పీకర్ ఎన్నిక

స్పీకర్‌ను లోక్‌సభ ప్రారంభ సమావేశంలో సభ్యుల మెజారిటీ పై నేరుగా ఎన్నుకుంటారు. స్పీకర్‌గా ఎన్నికయ్యేందుకు లోక్‌సభలో సభ్యత్వం కలిగి ఉండాలి.

స్పీకర్ కాలపరిమితి

లోక్‌సభ స్పీకర్ పదవీ కాలం ఐదేళ్లు. కానీ, నూతన స్పీకర్ ఎన్నికయ్యేంతవరకు పదవిలో కొనసాగుతారు. లోక్‌సభ రద్దయినా, తన కాలవ్యవధి పూర్తయినప్పటికీ స్పీకర్ పదవి రద్దు కాదు. కొత్త లోక్‌సభ ఏర్పడి స్పీకర్ ఎన్నికయ్యేంత వరకు పదవిలో ఉంటారు.

స్పీకర్ రాజీనామా,తొలగింపు పద్ధతి

ప్రకరణ 94 ప్రకారం స్పీకర్‌ను లోక్ సభ తొలగిస్తుంది. పదవిని దుర్వినియోగపరచడం, రాజ్యాంగ ఉల్లంఘన అనే కారణాలపై స్పీకర్‌ను తొలగించవచ్చు. సభలో తొలగింపు తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి 14 రోజుల ముందస్తు నోటీసును స్పీకర్‌కు ఇవ్వాలి.సభకు హాజరై ఓటు వేసిన సభ్యుల్లో మెజారిటీ సభ్యులు తీర్మానాన్ని ఆమోదిస్తే స్పీకర్ తన పదవి నుంచి దిగిపోతాడు.
స్పీకర్‌ను తొలగించే తీర్మానం సభా పరిశీలనలో ఉన్నప్పుడు స్పీకర్ సభకు అధ్యక్షత వహించరాదు. కానీ, సమావేశానికి హాజరుకావొచ్చు. తీర్మానంపై తన అభిప్రాయాన్ని వెల్లడించొచ్చు. తీర్మానంపై సాధారణ సభ్యుడిగానే ఓటు వేయొచ్చు. కానీ, నిర్ణయాత్మక ఓటు ఉండదు.
స్పీకర్ తన రాజీనామా పత్రాన్ని డిప్యూటీ స్పీకర్‌కు సమర్పిస్తారు.

స్పీకర్ అధికారాలు – విధులు


స్పీకర్ లోక్‌సభకు అధ్యక్షత వహిస్తాడు, సభా కార్యకలాపాలను నిర్వహిస్తారు.
సభలో జరిగే చర్చలు, తీర్మానాలు, ఓటింగ్ తదితర అంశాలను నియంత్రిస్తారు.లోక్‌సభ తరఫున ముఖ్య ప్రతినిధిగా వ్యవహరిస్తారు.
సభాహక్కులు, సభ గౌరవాన్ని, సభా ప్రతిష్టను కాపాడేందుకు చర్యలు తీసుకొంటారు. సభలో గందరగోళం ఏర్పడితే తగిన ఆదేశాల ద్వారా పరిస్థితిని చక్కదిద్దుతారు.
ఏదైనా బిల్లు విషయంలో అనుకూల, వ్యతిరేక ఓట్లు సమానమై ప్రతిష్టంభన ఏర్పడితే నిర్ణయాత్మక ఓటును (Casting Vote) వినియోగిస్తారు.
కొన్ని పార్లమెంటరీ కమిటీలకు చైర్మన్‌గా కూడా స్పీకర్ ఉంటారు. ఉదాహరణకు సభా వ్యవహారాల కమిటీ, రూల్స్ కమిటీ, జనరల్ పర్పస్ కమిటీ. అలాగే కొన్ని కమిటీల చైర్మన్లను కూడా నియమిస్తారు.లోక్‌సభకు చెందిన అన్ని కమిటీలు స్పీకర్ పర్యవేక్షణలోనే పనిచేస్తాయి.
సభలో జరిగే చర్చల సమయం, సభ్యులు లేవనెత్తే ఆక్షేపణలు, సభలో కోరం (Quorum) తదితర అంశాలపై స్పీకర్ నియంత్రణ ఉంటుంది.
అనుచితంగా ప్రవర్తిస్తున్న సభ్యులను హెచ్చరించడం, అది మితిమీరినప్పుడు సభ నుంచి వెళ్లమనడం, ఆ ఆదేశాన్ని ఉల్లంగించినప్పుడు సంబంధిత అధికారుల (Marshal)తో బలవంతంగా బయటకు పంపిస్తాడు.

పరిపాలన సంబంధిత అధికారాలు

లోక్‌సభ సచివాలయానికి అధిపతిగా ఉంటూ సిబ్బందిపై పరిపాలన నియంత్రణ కలిగి ఉంటారు.
బిల్లులకు సంబంధించి వివిధ అంశాలను పరిశీలించడానికి కమిటీని ఏర్పాటు చేస్తారు.
సభ్యులకు సంబంధించిన వసతులు, సౌకర్యాలు తదితర అంశాల నిర్వహణను పర్యవేక్షిస్తారు.

స్పీకర్‌కు ఉన్న ప్రత్యేక అధికారాలు

స్పీకర్ ద్రవ్య బిల్లులను ధ్రువీకరిస్తారు,దీనికి సంబంధించి అతని నిర్ణయం తుది నిర్ణయం.
స్పీకర్ లేదా ఆయన లేనప్పుడు, డిప్యూటీ స్పీకర్, పార్లమెంటు సంయుక్త సమావేశాలకు అధ్యక్షత వహిస్తారు.
అఖిల భారత స్పీకర్‌ల సమావేశానికి అధ్యక్షత వహిస్తారు
స్పీకర్ ఏ కమిటీలో నైనా సభ్యుడు అయితే అటువంటి కమిటీకి ఎక్సోఫిసియో చైర్మన్ గా ఉంటాడు.

స్పీకర్ ప్రత్యేక స్థానం

అతను లోక్ సభకు ఎన్నికైన సభ్యుడు అయినప్పటికీ, కొత్త లోక్ సభ ఏర్పడే వరకు సభ రద్దు తర్వాత కూడా ఆయన తన పదవిలో కొనసాగుతున్నారు. ఎందుకంటే, అతను పార్లమెంటు కార్యకలాపాలకు అధ్యక్షత వహించడం మరియు నిర్వహించడమే కాకుండా, లోక్ సభ సెక్రటేరియట్ హెడ్‌(అధిపతి)గా కూడా వ్యవహరిస్తాడు.
పార్లమెంటు ఉభయ సభల ఉమ్మడి సమావేశానికి స్పీకర్ అధ్యక్షత వహిస్తారు
స్పీకర్ భారత పార్లమెంటరీ గ్రూప్ యొక్క ఎక్స్-అఫిషియో ప్రెసిడెంట్.

ప్రొటెం స్పీకర్

రాజ్యాంగం ప్రకారం, గత లోక్ సభ స్పీకర్ కొత్తగా ఎన్నికైన లోక్ సభ మొదటి సమావేశానికి ముందు వెంటనే తన కార్యాలయాన్ని ఖాళీ చేస్తారు. అందువల్ల, రాష్ట్రపతి లోక్ సభ సభ్యుడిని ప్రొటెం స్పీకర్‌గా నియమిస్తారు. రాష్ట్రపతి స్వయంగా ప్రొటెం స్పీకర్‌తో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ప్రొటెం స్పీకర్‌కు స్పీకర్‌కు ఉన్న అన్ని అధికారాలు ఉంటాయి. కొత్తగా ఎన్నికైన లోక్ సభ మొదటి సమావేశానికి ఆయన అధ్యక్షత వహిస్తారు. కొత్త సభ్యులకు ప్రమాణ స్వీకారం చేయించడం అతని ప్రధాన కర్తవ్యం.

తీర్మానాలు

తీర్మానాల్లో అవిశ్వాస తీర్మానం, విశ్వాస తీర్మానం, వాయిదా తీర్మానం మొదలైనవి ఉన్నాయి

విశ్వాస తీర్మానం

విశ్వాస తీర్మానం ను లోక్‌సభలోనే ప్రవేశపెట్టాలి. అధికార పక్షం విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడుతుంది. విశ్వాస తీర్మానంపై చర్చ, ఆ తరువాత ఓటింగ్ జరుగుతాయి. ఓటింగ్ లో ప్రభుత్వం ఓడిపోతే వెంటనే రాజీనామా చేయాలి. భారతదేశ పార్లమెంటు చరిత్రలో మొదటిసారిగా విశ్వాస తీర్మానాన్ని 1979, ఫిబ్రవరిలో ప్రవేశపెట్టారు. అప్పటి చరణ్‌సింగ్ ప్రభుత్వాన్ని సభావిశ్వాసాన్ని పొందవలసిందిగా అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి ఆదేశించారు. దాంతో భారతదేశ పార్లమెంటరీ సంప్రదాయాల్లో విశ్వాస తీర్మానం ఆచరణలోకి వచ్చింది.

అవిశ్వాస తీర్మానం

అవిశ్వాస తీర్మానం,ప్రభుత్వాన్ని నియంత్రించే శక్తివంతమైన రాజ్యాంగ పద్ధతుల్లో ఇది ఒకటి. దీన్ని లోక్‌సభలో మాత్రమే ప్రవేశ పెట్టాలి. అవిశ్వాస తీర్మానం ఫలానా అంశంపై అని చెప్పనవసరం లేదు.ఎక్కువగా ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడతాయి. ఈ తీర్మానాన్ని మొత్తం మంత్రిమండలిపై ప్రవేశపెట్టాలి. అవిశ్వాస తీర్మానాన్ని సభ స్వీకరించడానికి కనీసం 50 మంది సభ్యుల మద్ధతు అవసరం. అవిశ్వాస తీర్మానం మద్ధతుకై నిర్ణయాధికారం స్పీకర్ కు ఉంటుంది.

వాయిదా తీర్మానం

వాయిదా తీర్మానం,ప్రజాప్రాముఖ్యం ఉన్న ఆకస్మిక లేదా హఠాత్ సంఘటనలను చర్చించడానికి స్పీకర్ అనుమతితో ఈ తీర్మానాన్ని ప్రవేశపెడతారు. దీన్ని ప్రవేశపెట్టేందుకు 50 మంది సభ్యుల మద్ధతు అవసరం. వాయిదా తీర్మానం అనుమతి పొందితే సభలో మిగిలిన వ్యవహారాలన్నీ వాయిదా వేస్తారు. ఈ తీర్మానం యొక్క ముఖ్యోద్దేశం ముఖ్యమైన విషయం మీదకు సభ దృష్టిని మళ్ళించడం. ఈ తీర్మానంపై ఓటింగ్ అంటూ ఏమి జరగదు.

సావధాన తీర్మానం

సావధాన తీర్మానం, ప్రజాప్రాముఖ్యం ఉన్న సమస్యను అత్యవసరంగా చర్చించేందుకు, ఆ సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళేందుకు ఈ తీర్మానాన్ని ప్రవేశపెడతారు. ఈ తీర్మానం ముఖ్యోద్దేశం సమస్యపై సంబంధిత మంత్రి నుంచి అధికారిక వ్యాఖ్యను కోరడం. సభ నియమాల ప్రకారం కనీసం ఇద్దరు సభ్యులు స్పీకర్ కు ఒక గంట ముందు నోటీసు ఇవ్వాలి.స్పీకర్ అనుమతి లభిస్తే 2.30 గంటలపాటు చర్చలు జరుగుతుంది.

No comments:

Post a Comment