TSPSC Group 1 Results 2023 : తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను జనవరి 13న టీఎస్‌పీఎస్సీ వెల్లడించిన విషయం తెలిసిందే. (రిజల్ట్ లింక్) .. ప్రిలిమినరీ పరీక్షలో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా 1:50 నిష్పత్తిలో 503 పోస్టులకు గాను మెయిన్స్‌కు 25,050 మందిని ఎంపిక చేసింది. మల్టీజోన్-2లో దృష్టిలోపం కలిగిన (మహిళా) అభ్యర్థులు సరైన సంఖ్యలో లేనందున 1:50 నిష్పత్తి ప్రకారం అక్కడ ఎంపిక కాలేదని.. తక్కువ మంది అర్హులయ్యారని పేర్కొంది. ఇక.. మెయిన్స్ పరీక్షలు జూన్ మొదటి లేదా రెండో వారంలో నిర్వహించనున్నట్లు వెల్లడించింది. పరీక్ష షెడ్యూలును జనవరి 18న TSPSC వెబ్‌సైట్లో పొందుపరచనున్నట్లు పేర్కొంది.
తెలంగాణ రాష్ట్రంలో 503 గ్రూప్-1 పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ 2022 ఏప్రిల్ 26న ఉద్యోగ ప్రకటన వెలువరించింది. రాష్ట్రవ్యాప్తంగా 3,80,081 మంది దరఖాస్తు చేసుకోగా అక్టోబరు 16న నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షకు 2,85,916 మంది హాజరయ్యారు. అక్టోబరు 29న ప్రాథమిక కీ ప్రకటించి, అభ్యంతరాలు ఆహ్వానించింది. వచ్చిన అభ్యంతరాలపై సబ్జెక్టు నిపుణుల కమిటీ సిఫార్సులు పరిశీలించి అయిదు ప్రశ్నలను తొలగించి నవంబరు 15న కమిషన్ తుది కీ ప్రకటించింది. మాస్టర్ ప్రశ్నపత్రం ప్రకారం 29, 48, 69, 82, 138 ప్రశ్నలను తొలగించింది. గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించి ఓఎంఆర్ జవాబు పత్రాల మూల్యాంకనాన్ని కమిషన్ గతంలోనే పూర్తిచేసింది. న్యాయవివాదాల కారణంగా ఫలితాల వెల్లడికి ఆటంకాలు ఎదురయ్యాయి. ఇటీవల కోర్టు స్పష్టత ఇవ్వడంతో కమిషన్ TSPSC Group 1 Results 2023 ప్రకటించింది.
