తెలంగాణ టీచర్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న లక్షలాది మంది నిరుద్యోగులకు విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణలో భారీగా ఉద్యోగాల భర్తీ కొనసాగుతున్న వేళ విద్యాశాఖ మంత్రి సబితా రెడ్డి నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పారు. టీచర్ ఉద్యోగాలపై కీలక ప్రకటన చేశారు. త్వరలోనే పదివేల ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. అసెంబ్లీలో పద్దులపై చర్చ సందర్భంగా మంత్రి సబితారెడ్డి ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు లేరని ఎక్కడా పాఠశాలలు మూసివేయలేదని స్పష్టం చేశారు. 317 జీవో కింద ఇతర జిల్లాలకు వెళ్లిన వారికి ప్రస్తుత బదిలీల్లో పాత జిల్లాల్లో పోస్టింగ్ ఇచ్చేందుకు అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. భాషా పండితులు, ఇతర సమస్యలు కొన్ని కోర్టుల్లో ఉండటంతో పరిష్కారం కాకుండా నిలిచిపోయాయని వివరించారు. మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా మొదటి దశ కింద మరమ్మతులు చేపట్టిన 9123 స్కూళ్లు జూన్ నెల నాటికి సిద్ధమవుతాయని మంత్రి తెలిపారు. మహబూబాబాద్, కొత్తగూడెం జిల్లా కేంద్రాల్లో కొత్త ఇంజినీరింగ్ కాలేజీల ప్రారంభానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని వివరించారు.