తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ) ఇటీవల పలు రకాల నోటిఫికేషన్లను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్లకు సంబంధించి దాదాపు పరీక్షల తేదీలను టీఎస్పీఎస్సీ ప్రకటించింది. పలు ఉద్యోగాలకు పరీక్షలను కూడా నిర్వహించింది. దీనిలో భాగంగానే రేపు (మార్చి 12న) టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్‌సీర్ ఉద్యోగాలకు పరీక్షను నిర్వహించనుంది. ఇప్పటికే హాల్ టికెట్స్ ను విడుదల చేసిన టీఎస్పీఎస్సీ డౌన్ లోడ్ చేసుకోని వారు ఎవరైనా ఉంటే.. అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి అడ్మిట్ కార్డులను డౌన్ లోడ్ చేసుకోవాలని టీఎస్పీఎస్సీ అధికారులు సూచించారు. మార్చి 12న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పేపర్ -1 పరీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు పేపర్ -2 పరీక్ష జరగనుంది. మొత్తం 175 ఉద్యోగాలకు సంబంధించి సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 13, 2022 వరకు దరఖాస్తులను స్వీకరించారు. 33,342 మంది ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెలవప్‌మెంట్ విభాగం కింద టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్‌సీర్ ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు. ఇప్పటికే గ్రూప్-1, పోలీస్, వైద్యారోగ్యశాఖ వంటి కీలక శాఖల్లో ఉద్యోగాల భర్తీకి సర్కారు నోటిఫికేషన్లు ఇవ్వగా.. గ్రూప్ 1 పోస్టులకు మెయిన్స్ పరీక్షలు జూన్ 5 నుంచి నిర్వహించనున్నారు. ఇటీవలే గ్రూప్ 4, గ్రూప్-2 ఉద్యోగాలకు సంబంధించి పరీక్ష తేదీలను కూడా టీఎస్పీఎస్సీ ప్రకటించగా.. గ్రూప్ 3 పరీక్ష సెప్టెబర్ చివరి వారంలో నిర్వహించే ఆలోచనలో అధికారులు ఉన్నట్లు సమాచారం.