తెలంగాణ పోలీస్ నియామకాలకు ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేయగా.. వాటికి ప్రిలిమ్స్, ఈవెంట్స్(Events) నిర్వహించింది పోలీస్ నియామక బోర్డు. వీటికి సంబంధించి మెయిన్స్ పరీక్ష తేదీలను కూడా ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారం 11 మార్చి 2023న SCT SI (IT & CO) పోస్టులకు టెక్నికల్ పేపర్(Technical Paper) రాత పరీక్షను నిర్వహించనున్నట్లు ప్రకటించగా.. నేడు ఈ పరీక్ష విజయవంతంగా పూర్తి చేశారు. మొత్తం 77 శాతానికి పైగా అభ్యర్థులు హాజరైనట్లు పోలీస్ నియామక బోర్డు తెలిపింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. నేడు(మార్చి 11న) నిర్వహించిన టెక్నికల్ పేపర్ ఎస్సీటీ ఎస్సై(ఐటీ అండ్ కో) మొత్తం 4099 మంది అభ్యర్థులు పరీక్ష రాయాల్సి ఉండగా.. 3233 మంది హాజరయ్యారు. ఈ పరీక్షను ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించారు. దీనికి 78.87 శాతం మంది హాజరయ్యారు. ఎస్సీటీ ఏఎస్సై ఫింగర్ ప్రింట్ బ్యూరో పరీక్షకు 2008 మంది పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా.. 1526 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు నిర్వహించిన ఈ పరీక్షకు 76 శాతం హాజరు పర్సంటేజ్ ఉన్నట్లు నియామక బోర్డు పేర్కొంది. మొత్తం రెండు పరీక్షలకు 6107 మంది అభ్యర్థులు హాజరుకావాల్సి ఉండగా..4759 మంది హాజరయ్యారు. మొత్తం మీద 77.93 శాతం మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరైనట్లు పోలీస్ నియామక బోర్డు ప్రెస్ నోట్ విడుదల చేసింది. అభ్యర్థుల బయోమెట్రిక్ వెరిఫికేషన్ , డిజిటల్ వేలిముద్రలు , డిజిటల్ ఫోటోగ్రాఫ్‌లను ఉపయోగించి ఎక్కడా ఎలాంటి ఘనటలు జరగకుండా.. పారదర్శకంగా ఈ పరీక్షను నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఇక ఈ SCT SI IT&CO మరియు SCT ASI FPB టెక్నికల్ పేపర్‌ల ప్రిలిమినరీ కీ అత్యంత త్వరలో ప్రకటిస్తామని.. వీటికి సంబంధించి ప్రాథమిక ధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచడం జరుగుతుందని ప్రెస్ నోట్ లో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ఏప్రిల్ 8, 9 తేదీల్లో ఎస్ఐ మెయిన్స్ రాత పరీక్షలు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించిన ఏప్రిల్ 30న తుది పరీక్ష ఉంటుందని బోర్డు ప్రకటించింది. వీటికి సంబంధించి హాల్ టికెట్లు త్వరలోనే వెబ్ సైట్లో అప్ లోడ్ చేయనున్నట్లు పేర్కొన్నారు.