Telangana Job Calender: తెలంగాణలో యువత గ్రేట్. వాళ్లలో చైతన్యం, పోరాట పటిమ, లక్ష్యాలను సాధించే గుణం ఇవన్నీ వాళ్ల జీన్స్ లోనే ఉన్నాయి. బలంగా కోరుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్న వారు.. ఇప్పుడు మరో యజ్ఞానికి సిద్ధమయ్యే టైమ్ వచ్చింది. అదేంటో చూద్దాం.
తెలంగాణలో నిన్న రాజకీయంగా ఓ ఆసక్తికర పరిణామం జరిగింది. ఏంటంటే..
ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి హరీశ్ రావు.. ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారు.
ఆరు నెలలైనా ఉద్యోగాలు ఇవ్వలేదనీ, జాబ్ కేలండర్ ఊసే లేదని అన్నారు. ఈ
మాటల్లో కొంత నిజం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ కేలండర్ ఇంకా
ప్రకటించలేదు. మరి నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. ఆల్రెడీ పోటీ పరీక్షల
కోసం వారు రోజూ ప్రిపేర్ అవుతూనే ఉన్నారు. ఇందుకోసం చాలా ఖర్చు కూడా
అవుతోంది. మరి జాబ్ కేలండర్ రాకపోతే, వారికి ఇబ్బందే కదా. ఐతే.. దీనిపై
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. త్వరలోనే జాబ్
కేలండర్ తెస్తాం అన్నారు. ఇది నిరుద్యోగులకు ఒకింత ఉపశమన ప్రకటన
అనుకోవచ్చు.
ఆరు నెలలైనా జాబ్ కేలండర్ తేకపోవడానికి కారణం గత బీఆర్ఎస్ ప్రభుత్వమే అని
శ్రీధర్ బాబు అన్నారు. “గడచిన పదేళ్లుగా అన్ని వ్యవస్థలనూ నాశనం చేశారు.
మీరు చేసిన దుర్మార్గాలను గాడినపెట్టడం సమస్యగా మారింది” అని ఆయన అన్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన ప్రతీ హామీకీ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని అన్నారు.
బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ పరీక్షలను అవకతవకలతో చేపడితే,
తాము 12 ఏళ్ల తర్వాత గ్రూప్ -1 పరీక్షను ఎలాంటి లోటుపాట్లు లేకుండా
విజయవంతంగా నిర్వహించామని మంత్రి చెప్పారు.
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3 నెలలకే ఎలక్షన్ కోడ్ వచ్చిందనీ, మొన్ననే
ముగిసిందని శ్రీధర్ బాబు గుర్తు చేశారు. ఇప్పుడిప్పుడే పాలనపై పట్టు
సాధిస్తున్నామనీ, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తామని మంత్రి మళ్లీ
చెప్పారు. మంత్రి మాటలను బట్టీ.. త్వరలో జాబ్ కేలండర్ వస్తుందనే అంచనాలు
కొంత బలపడ్డాయి.
జాబ్ కేలండర్ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తూ, రోజూ టెన్షన్‌తో
అభ్యర్థులు ఏం చదవగలరు? పీస్ ఆఫ్ మైండ్ ఉండదు. టెన్షన్‌తో చదివితే, ఏకాగ్రత
రాదు. అందువల్ల ప్రభుత్వం త్వరగా జాబ్ కేలండర్ తేవడమే మేలు. అభ్యర్థులకు
నెల నెలా ప్రిపరేషన్ ఖర్చులు భారం కాకుండా జాబ్ కేలండర్ వెంటనే తేవాల్సిన
అవసరం ఉంది. లేదంటే.. నిరుద్యోగ భృతి అయినా ఇవ్వాలి. ఎన్నికల హామీల్లో
నిరుద్యోగ భృతి లేదు కాబట్టి.. అది ఇస్తారని అనుకోలేం. కాబట్టి.. హామీ
ప్రకారం జాబ్ కేలండర్ త్వరగా తెస్తే, యువతకు మేలు చేసినట్లవుతుంది.
