లక్షలాది మంది నిరుద్యోగులు ఉత్కంఠగా ఎదురు చూస్తోన్న తెలంగాణ టీచర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి కీలక ప్రకన చేశారు మంత్రి సబితా రెడ్డి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
తెలంగాణలో టీచర్ ఉద్యోగాల (TS Teacher Jobs) భర్తీకి సంబంధించి డీఎస్సీ నోటిఫికేషన్ ను (TS DSC-2023) మంత్రి సబితా ఇంద్రారెడ్డి కొద్ది సేపటి క్రితం విడుదల చేశారు. మొత్తం 5,089 ఖాళీలను (Teacher Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. ప్రత్యేక విద్యార్థుల పాఠశాలల్లో 1,523 పోస్టుల భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఈసారి టీఎస్పీఎస్సీ ద్వారా కాకుండా స్కూల్ ఎడ్యుకేషన్ ద్వారా ఖాళీలను భర్తీ చేస్తామని మంత్రి వెల్లడించారు. మరో రెండు రోజుల్లో డీఎస్పీ పూర్తి షెడ్యూల్ ను విడుదల చేస్తామన్నారు. గతంలో టీచర్ ఉద్యోగాలను టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేయగా ఈ సారి మాత్రం.. సీఎం కేసీఆర్ (CM KCR) ఆదేశాల మేరకు అంతకు ముందు మాదిరిగా డీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామన్నారు. నియామకాలకు సంబంధించి జిల్లాల వారీగా జిల్లా కలెక్టర్లు చైర్మన్ గా ఉంటారని.. అడిషనల్ కలెక్టర్ వైస్ చైర్మన్ డీఈఓ సెక్రటరీగా ఉంటారని తెలిపారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలను రూపొందించి నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. సెప్టెంబర్ 15న టెట్ పరీక్ష ఉంటుందన్నారు. 27న ఫలితాలు విడుదల అవుతాయన్నారు. ఆ వెంటనే నోటిఫికేషన్ విడుదల చేసి నియామకాలు చేపట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారన్నారు. ఆ మేరకు చర్యలు చేపడుతున్నట్లు మంత్రి ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గురుకులాల్లో ఇప్పటికే దాదాపు 11 వేలకు పైగా నియామకాలు చేశామన్నారు. ప్రస్తుతం మరో 12 వేల ఖాళీల భర్తీకి నియామక ప్రక్రియ సాగుతోందన్నారు.

No comments:
Post a Comment