
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు వరాల వర్షం కురిపిస్తోంది. ఐటీ హబ్స్, ఐటీ టవర్స్ ద్వారా ఉద్యోగ అవకాశాలను పెంపొందిస్తోంది. కొత్తగా ప్రారంభమైన రెండు ఐటీ హబ్స్ వివరాలు తెలుసుకోండి.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఐటీ హబ్‌లతో నిరుద్యోగ యువతకు పెద్ద సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. ఆధునిక సాంకేతిక హంగులతో రూపొందిన ఈ హబ్‌లతో నల్లగొండ, సూర్యాపేట జిల్లాలు కొత్త రూపు సంతరించుకోనున్నాయి. ఈ హబ్‌లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. మొదటి వారం నుంచే కంపెనీలు ఇక్కడ కార్యకలాపాలను ప్రారంభించనున్నాయి. రెండు జిల్లాల్లో సుమారు 32 కంపెనీలు ఈ హబ్ నుంచి పనిచేస్తాయి. ఆ తర్వాత మరిన్ని కంపెనీలు రానున్నాయి. ఇప్పటికే నల్లగొండ, సూర్యాపేటలో పలు కంపెనీలు పరీక్షలు నిర్వహించగా, పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు హాజరయ్యారు. నల్లగొండలో రూ.90కోట్లతో పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో మూడెకరాల విస్తీర్ణంలో ఐదు అంతస్తుల భవనాన్ని నిర్మించారు. నల్లగొండ ఐటీ హబ్ టవర్‌లో మొత్తం 3,800 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. మొదట 17 కంపెనీలు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో ఒప్పందం చేసుకున్నాయి. తొలి దశలో 1,200 మంది యువతకు, వచ్చే రెండు ఏళ్లల్లో 1,200 మందికి మొత్తం మూడు విడతల్లో 3,800 మందికి ఉపాధి ఆవకాశాలు కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వీరికి మంచి వేతన ప్యాకేజీలను ఆఫర్ చేయబోతున్నాయి కంపెనీలు. ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలకు ఎంపికైన వారికి అర్హతల ప్రకారం ఏడాదికి రూ.1.25లక్షల నుంచి రూ.25లక్షల వరకు ప్యాకేజీ ఇచ్చేందుకు ఆయా కంపెనీలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇదిలా ఉండగా, నల్లగొండలోని ఐటీ హబ్‌ను రికార్డు సమయంలో నిర్మించారు. ఈ ఐటీ హబ్ పరిసరాలు అందంగా తీర్చిదిద్దారు. టవర్ ఎదుట గ్రీనరీ, గార్డెన్ ఏర్పాటు చేశారు. కార్యాలయం గదుల్లో పర్నీచర్, ఏసీ వంటి సదుపాయాలు కల్పించారు. అయితే సూర్యాపేటలో ఐటీ హబ్ ప్రారంభించబోతున్నట్లు గత ఏడాదే మంత్రి కేటీఆర్ కాలిఫోర్నియాలో ప్రకటించారు. అందుకుగాను గ్లోబల్ ఐటీ సంస్థతో పాటు మరిన్ని సంస్థలు ముందుకు వస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు.
No comments:
Post a Comment