గ్రూప్-1, 2, 3, 4, పోలీస్ కానిస్టేబుల్, ఎస్‌ఐ, ఇతర విభాగాల్లోని ఖాళీలకు సంబంధించిన నోటిఫికేషన్‌లు ఇప్పటికే వెలువడ్డాయి. పరీక్షలు కూడా జరుగుతున్నాయి.. దాదాపు అన్ని రకాల నోటిఫికేషన్లు వెలువడడమే కాకుండా వాటి నియామక ప్రక్రియ కూడా కొనసాగుతోంది. చాలా పోస్టుల నియామక ప్రక్రియ ఇప్పటికే తుదిదశకు కూడా చేరుకుంది. ఇక మిగిలింది ముఖ్యమైన ఒకే ఒక నోటిఫికేషన్ టీచర్ పోస్టుల నోటిఫికేషన్. ఎంతో మంది అభ్యర్థులు తమ ఆశల కొలువుగా చెప్పుకునే ఉపాధ్యాయ ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. లక్షలాది మంది అభ్యర్థులు దీనికోసం ఎంతోకాలంగా నిరీక్షిస్తున్నారు. నిజానికి మేలోనే నోటిఫికేషన్ జారీ చేస్తారన్న ప్రచారం జరిగింది. ఉపాధ్యాయ ఖాళీల లెక్కతేల్చిన తర్వాతే టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చెస్తారని అప్పట్లో అంతా భావించారు. అయినా ఎలాంటి నోటిఫికేషన్ విడుదల కాలేదు. టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ తర్వాత డీఎస్సీ లేదా టీఆర్టీ ఉంటుందని బీఈడీ, డీఈడీ పూర్తి చేసుకుని ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులు అభిప్రాయపడ్డారు. ఇప్పటికే ప్రభుత్వం టీచర్ పోస్టుల ఖాళీలను కూడా ప్రకటించింది. స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీ పోస్టులు 13 వేల వరకు ఖాళీగా ఉన్నట్లు పేర్కొంది. టీచర్ల హేతుబద్ధీకరణ తర్వాత మరో ఐదు వేలకుపైగా ఖాళీలు ఏర్పడనున్నట్లు ఉపాధ్యాయ సంఘాలు అంచనా వేస్తున్నాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ ఏడాది బడ్జెట్ సమావేశాల్లో త్వరలోనే 10 వేల టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించారు. దీంతో 10 వేల నుంచి 15 వేల వరకు టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేస్తారని భావించినా ఇప్పటివరకు నోటిఫికేషన్ రాలేదు.

No comments:
Post a Comment