Mother Tongue

Read it Mother Tongue

Saturday, 25 February 2023

ఇంటర్‌తోనే ఉద్యోగాలు.. ఏడాదికి రూ.2.5 లక్షల జీతం.. సెలక్షన్‌ ప్రాసెస్‌ ఇలా ఉంటుంది

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ కావాలని కలలు కనే యువతకు గుడ్‌న్యూస్‌. ఇకపై ఇంటర్‌ పాసైన విద్యార్థులు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు చేయొచ్చు. అందుకోసం నాలుగేళ్ల బీటేక్ కోర్స్‌.. డిగ్రీ కోర్స్‌ చేయాల్సిన అవసరం లేదు. కోర్సులు నేర్చుకోవడానికి కోచింగ్‌ సెంటర్ల చుట్టూ తిరగడం, ఫేక్‌ సర్టిఫికెట్లు పెట్టడం, ఫ్రాక్సీలంటూ లక్షల రూపాయలు కట్టడం, వెరిఫికేషన్లు వంటి గోల ఏమీ ఉండదు. ఇంటర్‌తోనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగం సంపాదించే సువర్ణావకాశాన్ని కల్పించబోతోంది తెలంగాణ ప్రభుత్వం.

సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కావాలని లక్ష్యమున్న విద్యార్థులకు ఇంటర్మీడియట్ స్థాయిలోనే అవకాశాలు కల్పించడంపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఆ దిశగా తీసుకోవాల్సిన చర్యలతో పాటు ఇంటర్ వార్షిక పరీక్షల నిర్వహణ కోసం అధికారులతో గురువారం మంత్రి తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఏటా 20 వేల మంది ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులకు ఉపాధికాశాలు కల్పించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఇందుకుగానూ.. రాష్ట్ర ప్రభుత్వానికి, హెచ్‌సీఎల్ (HCL) సంస్థకు మధ్య ఒప్పందం కుదిరిందని మంత్రి పేర్కొన్నారు. మ్యాథ్స్ సబ్జెక్టు కలిగి ఉండి.. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహించనున్నట్లు మంత్రి వివరించారు.

అయితే.. ఈ ఆన్‌లైన్ పరీక్షలో కనీసం 60 శాతం మార్కులు సాధించిన స్టూడెంట్స్‌కు వర్చువల్ పద్ధతిలోనే ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఇంటర్వూల్లో మెరుగైన ప్రదర్శన చేసినవారిని సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు తీసుకుంటారు. ఇలా సెలెక్ట్ అయిన విద్యార్థులకు ఆన్‌లైన్‌లోనే ఆరు నెలల పాటు ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ పూర్తి చేసుకున్న వారికి హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఆఫీస్‌లో 6 నెలల పాటు ఇంటర్న్‌షిప్ అవకాశం కల్పించి నెలనెలా 10 వేల స్టైఫండ్ కూడా ఇస్తారు. ఇంటర్న్‌షిప్ పూర్తయిన తర్వాత ఏడాదికి రెండున్నర లక్షల ప్యాకేజీ ఇస్తారు. అంతేకాకుండా.. వీళ్లకు ఉద్యోగం చేస్తూనే బిట్స్, శాస్త్ర, అమిటీ యూనివర్సిటీల్లో ఇంటిగ్రేటెడ్ డిగ్రీ పూర్తి చేసేందుకు అవకాశం కూడా కల్పిచంనున్నట్లు మంత్రి వివరించారు. ఇలా ప్రతీ సంవత్సరం శాలరీ ఇంక్రిమెంట్లు కూడా ఉంటాయని.. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చే పేద విద్యార్థులకు ఇది సువర్ణావకాశమని మంత్రి పేర్కొన్నారు.

1 comment:

Job Alerts and Study Materials