Budget 2023 : కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Seetharaman) ఫిబ్రవరి 1న లోక్‌సభలో బడ్జెట్ 2023ను ప్రవేశపెట్టారు. అయిదోసారి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆరో మంత్రిగా ఆమె రికార్డు క్రియేట్ చేశారు. వరుసగా అయిదోసారి ఆమె బడ్జెట్ ప్రవేశపెట్టారు. అంతముందు బడ్జెట్‌ను అయిదుసార్లు ప్రవేశపెట్టిన ఆర్ధిక మంత్రుల్లో మన్మోహన్ సింగ్, అరుణ్ జైట్లీ, పి. చిదంబరం ఉన్నారు. ఈ బడ్జెట్ ప్రసంగంలో భాగంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల అభివృద్ధే లక్ష్యంగా బడ్జెట్ రూపొందించినట్లు తెలిపారు. ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించినట్లు పేర్కొన్నారు.
పాఠశాల విద్యార్థుల్లో చదువుపై ఆసక్తి పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. విద్యార్థుల కోసం ప్రత్యేకంగా 'నేషనల్ డిజిటల్ లైబ్రరీలు(NDL)' ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. నాణ్యమైన పుస్తకాల లభ్యత కోసం జాతీయ డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పంచాయతీ, వార్డు స్థాయిల్లో లైబ్రరీలను ఏర్పాటు చేసే రీతిలో రాష్ట్ర ప్రభుత్వాలను ఎంకరేజ్ చేయనున్నట్లు మంత్రి చెప్పారు. పిల్లలకు నాణ్యమైన పుస్తకాలను అందుబాటులో ఉంచాలన్న ఉద్దేశంతో ఈ లైబ్రరీని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. అన్ని ప్రాంతీయ భాషల్లో మరిన్ని పుస్తకాలను అందుబాటులోకి తేనున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
ఇక.. ఆదివాసీల అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టామని. ఆదివాసీ ప్రాంతాల్లో మౌలిక సౌకర్యాల కోసం రూ.15వేల కోట్లు. గిరిజన విద్యార్థుల కోసం దేశవ్యాప్తంగా ఉన్న ఏకలవ్య పాఠశాలల్లో 38,800 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఆర్థికమంత్రి వెల్లడించారు. డిజిటల్ ఎపిగ్రఫీ మ్యూజియం ఏర్పాటు చేస్తామని తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న 740 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో సుమారు 3.5 లక్షల మంది గిరిజన విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
2014 నుంచి దేశవ్యాప్తంగా 150కు పైగా మెడికల్ కాలేజీలకు అనుమతి ఇచ్చాం. త్వరలోనే ఐసీఎంఆర్ ప్రయోగశాలల విస్తృతిని మరింత పెంచుతాం. ఫార్మారంగంలో ఆవిష్కరణలకు ప్రోత్సాహం ఇస్తాం. వైద్య కళాశాలల్లో మరిన్ని ఆధునిక సౌకర్యాలు కల్పిస్తాం. అధ్యాపకుల శిక్షణకు డిజిటల్ విద్యావిధానం, జాతీయ డిజిటల్ లైబ్రరీ తీసుకొస్తామని ఆర్థికమంత్రి వెల్లడించారు.
No comments:
Post a Comment