
స్పెషల్ టీచర్ పోస్టుల భర్తీకి కేటాయించిన 1523 ఖాళీల భర్తీకి బ్రేక్ పడింది. ప్రభుత్వం తాజాగా జారీ చేసిన టీఆర్టీ నోటిఫికేషన్లో వీటి ప్రస్తావన ఎక్కడా పేర్కొనలేదు. కేవలం నోటిఫికేషన్లో 5,089 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రత్యేక విద్య ఉపాధ్యాయుల నియామకాలపై ఎటువంటి నోటిఫికేషన్ ఇవ్వలేదు. వీటి భర్తీలో కొన్ని సమస్యలు ఉన్నాయని.. వాటిని పరిష్కరించాక భర్తీ చేస్తామని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. భర్తీ చేయాలనుకున్న 1,523 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల కొలువుల్లో 796 ఎస్జీటీ, 727 స్కూల్ అసిస్టెంట్ల(SA) పోస్టులున్నాయి. అయితే నిబంధనల ప్రకారం ముందుగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులను ఎస్‌జీటీలకు పదోన్నతులిచ్చి భర్తీ చేయాలి. 70 శాతం వరకు పదోన్నతుల ద్వారా భర్తీ చేసి.. మిగిలిన 30 శాతం ప్రత్యక్ష నియామకాల ద్వారా నింపాలి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు 600 మంది వరకు ఉన్నారు. వారు తమకు పదోన్నతులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే నోటిఫికేషన్ జారీకి ప్రధాన అవరోధంగా మారినట్లు తెలుస్తోంది. దీంతో పాటు.. ప్రస్తుతం మండలానికి ఒకటి చొప్పున సమగ్ర శిక్ష అభియాన్ ఆధ్వర్యంలో నడుస్తున్న భవిత కేంద్రాల్లో 970 మంది ఐఈఆర్‌పీ(ERP)లు పదేళ్లుగా పనిచేస్తున్నారు. వీరంతా కాంట్రాక్టు విధానం ద్వారా నియమితులయ్యారు. అన్ని విద్యార్హతలున్న తమను క్రమబద్ధీరించాలని కోరుతున్నారు. ఈ రెండు కారణాలతో నోటిఫికేషన్ ఆగిపోయిందని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. వీరికి టీఆర్‌టీ నియామకాల్లో కొంత వెయిటేజీ ఇవ్వాలని కొన్ని సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ టీఆర్టీ నోటిఫికేషన్ తర్వాత స్పెషల్ టీచర్ పోస్టులను భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయి. దివ్యాంగులు, ఇతర వైకల్యాలతో బాధపడేవారికి రెగ్యులర్ టీచర్లు బోధించే పాఠాలు సరిపోవు. వీరికి సుశిక్షితులైన టీచర్లే బోధించాలని సుప్రీంకోర్టు గతంలోనే తీర్పునిచ్చింది. 10 మంది విద్యార్థులుంటే ప్రత్యేకంగా టీచర్లను నియమించాలని సూచించింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ సర్కారు సమగ్రశిక్ష ప్రాజెక్ట్ ద్వారా మండలానికి ఒకటి చొప్పున భవిత సెంటర్లను నిర్వహిస్తున్నది. వీటిలో 970 టీచర్లు కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నారు.
No comments:
Post a Comment