తెలంగాణలో గ్రూప్-1తో (TSPSC Group-1) పాటు డీఏఓ, ఏఈఈ పరీక్షలను రద్దు చేస్తూ టీఎస్పీఎస్సీ నిర్ణయం తీసుకుంది. జూన్ 11న గ్రూప్-1 ప్రిలిమ్స్ ను తిరిగి నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఇటీవల పేపర్ లీక్ అయినట్లు నిర్ధారణ కావడంతో ఏఈ పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాజాగా గ్రూప్-1, డీఏఓ పరీక్షలను సైతం రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. పేపర్ లీక్ పై (TSPSC Paper Leak) విచారణ చేపట్టిన స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీమ్ (SIT) నుంచి అందిన రిపోర్ట్ ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. సిట్ విచారణలో గ్రూప్-1 పేపర్ సైతం లీక్ అయినట్లు నిర్ధారణ కావడంతోనే టీఎస్పీఎస్సీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
పేపర్ లీక్ కేసులో ప్రధాన నిందితుడైన ప్రవీణ్ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు హాజరు కావడం.. ఇంకా అతనికి 103 మార్కులు వచ్చినట్లు నిర్ధారణ కావడంతో పేపర్ లీక్ అయిందన్న అనుమానాలు అందరిలో వ్యక్తం అయ్యాయి. సిట్ సైతం ఆ విషయాన్ని కన్ఫామ్ చేయడంతో పరీక్ష రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలి గ్రూప్-1 నోటిఫికేషన్ ను మొత్తం 503 ఖాళీలతో విడుదల చేసింది పబ్లిక్ సర్వీస్ కమిషన్.
ఇందుకు సంబంధించిన ప్రిలిమినరీ ఎగ్జామ్ ను అక్టోబర్ 16న నిర్వహించింది. మొత్తం 503 పోస్టులకు గాను.. 3,80,081 మంది దరఖాస్తు చేసుకోగా.. వీరిలో 2,85,916 మంది ప్రిలిమ్స్ పరీక్షకు హాజరయ్యారు. ఒక్కో పోస్టుకు 50 మందిని చొప్పున మొత్తం 25,050 మందిని మెయిన్స్ కు ఎంపిక చేసింది పబ్లిక్ సర్వీస్ కమిషన్. దీంతో మెయిన్స్ కు ఎంపికైన అభ్యర్థులంతా సీరియస్ గా ప్రిపరేషన్లో ఉన్నారు. ఇప్పుడు పరీక్షను రద్దు చేస్తూ టీఎస్పీఎస్సీ నిర్ణయం తీసుకోవడంతో వీరంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
No comments:
Post a Comment