తెలంగాణ పోలీస్ శాఖలో దాదాపు 16,929 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నియామక ప్రక్రియ కొనసాగుతోన్న విషయం తెలిసిందే. పోలీస్ శాఖలోని జైళ్లశాఖ, అగ్నిమాపకశాఖ, రవాణా, ఎక్సెజ్ శాఖల్లో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఇప్పటికే ప్రిలిమినరీ పరీక్ష, ఫిజికల్ ఈవెంట్స్, తుది రాత పరీక్ష కూడా పూర్తి అయ్యింది. దీంతో ఎంపికైన అభ్యర్థుల లిస్ట్ విడుదల కావాల్సి ఉంది. ఇందుకోసం 1,01,600 మంది అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అయితే.. కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి తుది జాబితాను సెప్టెంబర్ మూడోవారంలో విడుదల చేయనున్నట్లు తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వర్గాల నుంచి సమాచారం. ఈ మేరకు బోర్డు ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. తుది రాత పరీక్షలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు అర్హత సాధించిన వారి జాబితాను మే 30న పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ ను జూన్ 1న పూర్తి అయ్యింది. మొత్తం 1,01,600 మంది అభ్యర్థులు తుది అర్హత సాధించిన వారిలో ఉండగా.. వీరికి సంబంధించిన అన్ని రికార్డులు, ఆయా జోన్లు, పోలీస్, రెవెన్యూ జిల్లాలు, సామాజికవర్గాల వారీగా ఎంపిక ప్రక్రియను నిర్వహిస్తున్నారు అధికారులు. ఇదిలా ఉంటే.. ఎస్ఐ పోస్టులకు ఎంపికైన వారికి తుది జాబితాను బోర్డు ఇప్పటికే విడుదల చేసింది. ప్రస్తుతం వారి నియామక ప్రక్రియ తుదిదశకు చేరింది. ఎస్బీ ఎంక్వెరీ, మెడికల్ టెస్ట్ లను ప్రస్తుతం నిర్వహిస్తున్నారు. ఈ నెలాఖరు నాటికి ఎస్ఐగా ఎంపికైన వారికి శిక్షణను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది పోలీస్ శాఖ.

No comments:
Post a Comment