తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి ఆధ్వర్యంలో చేపట్టిన నియామక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఇప్పటికే ఎస్సై అభ్యర్థుల ఎంపిక జాబితాను టీ ఎస్పీ ఎల్ ఆర్ బీ విడుదల చేసింది. ఆగస్టు మూడవ వారంలో లేదా సెప్టెంబరు మొదటి వారంలో కానిస్టేబుల్ ఎంపిక జాబితా కూడా ప్రకటించనుంది. ఎస్సై, కానిస్టేబుల్ కొలువులకు సంబంధించిన తుది జాబితా విడుదలైన తర్వాత కొత్తగా నియామకం కానున్న ఉద్యోగుల శిక్షణపై పోలీసు శాఖ దృష్టి సారించింది. రాష్ట్రవ్యాప్తంగా ఎంపికయ్యే 554 మంది ఎస్సై, 9,871 మంది కానిస్టేబుళ్ల అభ్యర్థులకు 28 కేంద్రాల్లో శిక్షణ ఇచ్చేందుకు టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ ఏర్పాట్లు చేస్తోంది. వీరిలో దాదాపు 2200 మంది మహిళా అభ్యర్ధులకు ప్రత్యేకంగా 3 కేంద్రాలు కేటాయించింది. పోలీసు విచారణ అనంతరం ఎలాంటి సమస్య లేనివారి పేర్లను తుది జాబితాలో చేరుస్తారు. ఎస్సైలకు టీఎస్‌పీఏ ఆధ్వర్యంలో, కానిస్టేబుళ్లకు శిక్షణ విభాగం నేతృత్వంలో దాదాపు 9 నెలలపాటు శిక్షణ ఇవ్వనున్నారు. కానిస్టేబుళ్లకు అక్టోబర్‌లో శిక్షణ ఉండనుంది. కానిస్టేబుల్ ఫలితాల కోసం పరీక్ష రాసిన అభ్యర్థులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. 17,156 కానిస్టేబుళ్ల స్థాయి పోస్టుల్లో.. జైళ్లు, ఫైర్ తదితర విభాగాల పోస్టులు పోగా 14,881 మంది కానిస్టేబుళ్లను పోలీసు శాఖ ఎంపిక చేయనుంది. వీరిలో 5,010 టీఎస్‌ఎస్‌పీ, 4,965 సివిల్, 4,523 ఏఆర్, 121 పీటీవో, 262 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్స్ విభాగాల కానిస్టేబుళ్లు ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణలోని పోలీస్‌శాఖకు 12వేల మందికి సరిపడా మాత్రమే శిక్షణ మైదానాలు మాత్రమే ఉన్నాయి. 2018 నోటిఫికేషన్‌లో ఎంపికైన 16 వేల మంది శిక్షణకు మైదానాలు సరిపోవని టీఎస్‌ఎస్‌పీ శిక్షణను 9 నెలలు వాయిదా వేసింది. ఈసారీ అలాగే చేసే అవకాశం ఉంది. సరిపడా మైదానాలు లేనందున టీఎస్‌ఎస్‌పీ శిక్షణను రెండో విడతలోనే నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

No comments:
Post a Comment