ఏపీలో సీఎం జగన్ అధ్యక్షతన ఈ రోజు జరిగిన కేబినెట్ సమావేశం పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. 6,840 కొత్త పోస్టుల మంజూరుకు ఆమోద ముద్ర వేసింది. ఇందులో పోలీస్ బెటాలియన్ లో 3920, కొత్త మెడికల్ కాలేజీల్లో 2,118, కడప మానసిక కాలేజీలో 116, సీతానగరం పీహెచ్సీలో 23, పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్ డయాలసిస్ యూనిట్ లో 21 మెడికల్ ఆఫీసర్, రాష్ట్రంలోని 476 జూనియర్ కాలేజీల్లో నైట్ వాచ్ మెన్ పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. గ్రూప్ 1, 2 నియామకాలకు సైతం కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇంకా.. వివిధ ప్రభుత్వ శాఖలో పని చేస్తున్న 10,117 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఇంకా ప్రభుత్వ ఉద్యోగులకు సైతం జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త పీఆర్సీ 12 ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఇంకా జనవరి 1వ తేదీ నుంచి ఉద్యోగులందరికీ ఏరియర్స్ తో 2.73 శాతం డీఏను వర్తింపజేయనుంది ప్రభుత్వం. ఇంకా జిల్లా కేంద్రాల్లో పని చేసే ఉద్యోగులకు హెచ్ఆర్ఏను 12 నుంచి 16 శాతానికి పెంచింది ప్రభుత్వం. ప్రభుత్వ పెన్షన్ విధానంపై బిల్లును రూపొందించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇటీవల కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణపై కీలక నిర్ణయం తీసుకోగా అందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 2024 జూన్ 2 నాటికి ఐదేళ్లు పూర్తయిన ఉద్యోగులకు ఈ క్రమబద్దీకరణ వర్తించనుంది. అలాగే అమ్మ ఒడి పథకం అమలు, విద్యాకానుక పంపిణీకి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇన్వెస్టర్ సమ్మిట్ లో ఎంవోయూలు చేసుకున్న కొన్ని సంస్థలకు భూ కేటాయింపుకు ఆమోదం తెలిపింది. అలాగే ఏపీ గ్యారెంటెడ్ పెన్షన్ బిల్లు 2023 పేరుతో కొత్త పెన్షన్ విధానం అమలుకు నిర్ణయం తీసుకుంది. మొత్తం 63 అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

No comments:
Post a Comment