ఏపీలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఎంపిక చేసిన పది జిల్లాల్లోని 11 కేంద్రాల్లో ఈ గ్రూప్-1 ప్రధాన పరీక్షలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ పరీక్షలు జూన్ 3వ తేదీన ప్రారంభమై.. పదో తేదీ వరకు కొనసాగుతాయని వెల్లడించారు. ఈ పరీక్ష రాయడానికి ప్రిలిమ్స్ లో మొత్తం 6,455 మంది అర్హత సాధించినట్లు గౌతమ్ సవాంగ్ తెలిపారు. బుధవారం ఏపీపీఎస్సీ కార్యాలయంలో పరీక్షల నిర్వహణపై ఆయన మాట్లాడుతూ.. సాంకేతిక సమస్యల కారణంగా గతంలో మాదిరిగా ట్యాబ్ లో ప్రశ్నపత్రాలు ఇవ్వడం లేదన్నారు. ప్రశ్నాపత్రాలను నేరుగా అందిస్తామన్నారు. ఏపీపీఎస్సీ కార్యాలయం నుంచి పరీక్షలను పరిశీలించేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష ఉంటుందని ఆయన తెలిపారు. ఉదయం 8.30 గంటలకు పరీక్ష కేంద్రాల గేట్లు తెరుస్తామన్నారు.
అభ్యర్థులు 9.30 గంటలలోగా తమ గదులకు వెళ్లాలని సూచించారు. 9.45 నిమిషాలు దాటితే అభ్యర్థులను కేంద్రాల్లోకి అనుమతించేది లేదని స్పష్టం చేశారు. కాపీయింగ్, మాల్ ప్రాక్టీస్ కు అవకాశం లేకుండా అన్ని రకాల చర్యలు చేపట్టినట్లు చెప్పారు. జవాబుపత్రాల మూల్యాంకనంపై కమిషన్ నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఆ వివరాలను బహిర్గతం చేయమని స్పష్టం చేశారు.
జులైలో గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు, ఆగస్టులో ఇంటర్వ్యూలను నిర్వహించేందుకు ప్రణాళిలకు రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది జనవరి 8 న గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించింది. పరీక్షలు నిర్వహించిన కేవలం 19 రోజులకే ఫలితాలను విడుదల చేసి రికార్డు సృష్టించింది ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్. మొత్తం 92 పోస్టులకు నిర్వహించిన ఈ పరీక్షకు 1,26,449 మంది అప్లై చేసుకోగా.. మెయిన్స్ కు 6,455 మంది అర్హత సాధించారు.

No comments:
Post a Comment