Mother Tongue

Read it Mother Tongue

Monday, 9 January 2023

త్వరలోనే గ్రూప్‌-1 ప్రిలిమినరీ ఫలితాలు: టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ జనార్దన్‌ రెడ్డి

రెండు, మూడు రోజుల్లో రిజల్ట్స్‌ వెలువడే అవకాశం
కోర్టు కేసులతో విడుదలలో జాప్యం
కసరత్తు పూర్తి చేసిన టీఎస్‌పీఎస్సీ

హైదరాబాద్‌, జనవరి 8 (నమస్తే తెలంగాణ): తెలంగాణ తొలి గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల వెల్లడికి టీఎస్‌పీఎస్సీ కసరత్తు పూర్తి చేసింది. రెండు, మూడు రోజుల్లో ఫలితాలు ప్రకటించేందుకు ఏర్పాట్లు చేసింది. దీనికి సంబంధించి కమిషన్‌ ఇప్పటికే రెండు, మూడు సార్లు ప్రత్యేక సమావేశాలు నిర్వహించింది. 503 గ్రూప్‌-1 ఉద్యోగాలకు అక్టోబర్‌ 16న టీఎస్‌పీఎస్సీ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించింది. అదే నెల 29న ప్రాథమిక ‘కీ’ విడుదల చేసింది.

అభ్యంతరాలను స్వీకరించి, నిపుణుల కమిటీతో చర్చించి, చివరికి 5 ప్రశ్నలను తొలిగించి, నవంబర్‌ 15న తుది ‘కీ’ని వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. ఆ తర్వాత రెండు, మూడు వారాల్లోనే ప్రిలిమ్స్‌ ఫలితాలు వెల్లడిస్తామని టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. ఇంతలోనే ఇద్దరు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. దీనిపై సోమవారం కోర్టులో ఫైనల్‌ హియరింగ్‌ ఉన్నది. సోమ లేదా మంగళవారం కోర్టు కేసు కొలిక్కి వచ్చే అవకాశమున్నది. ఆ వెంటనే, మంగళవారం లేదా బుధవారం ప్రిలిమ్స్‌ ఫలితాలు వెల్లడించాలని టీఎస్‌పీఎస్సీ భావిస్తున్నది. దీనికి సంబంధించి ఇప్పటికే అన్నీ సిద్ధం చేసి పెట్టింది.

రెండు నెలల క్రితమే మూల్యాంకనం పూర్తి..

ఓఎంఆర్‌ షీట్ల స్కానింగ్‌ ప్రక్రియను రెండు నెలల క్రితమే టీఎస్‌పీఎస్సీ పూర్తి చేసింది. తుది ఫలితాల ప్రకటనలో ఎటువంటి పొరపాట్లకు తావివ్వకూడదని కమిషన్‌ భావిస్తున్నది. అందుకే, జవాబు పత్రాల మూల్యాంకనాన్ని ఒకటికి రెండుసార్లు పరిశీలించింది. గతంలో గ్రూప్‌-1 పరీక్ష సమయంలో జరిగిన పొరపాట్లు ఏంటి? గతంలో కమిషన్‌ తీసుకున్న చర్యలేంటి? మిగిలిన రాష్ర్టాల్లో కమిషన్లు ఎలా వ్యవహరిస్తున్నాయి? వంటి అనేక విషయాలను క్షుణ్ణంగా పరిశీలించి, పటిష్ట ప్రణాళికతో అడుగులు వేస్తున్నది. అభ్యర్థులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నది. తొలుత ఫిబ్రవరిలో గ్రూప్‌-1 మెయిన్స్‌ నిర్వహిస్తామని టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. కోర్టు కేసులతో ఫలితాల్లో జాప్యం జరిగింది. మే 28వ తేదీన సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమినరీ పరీక్ష ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఏప్రిల్‌ నెలలోనే మెయిన్స్‌ పరీక్ష నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీ భావించింది. అయితే, కోర్టు కేసులతో కాస్త ఆలస్యం కావడంతో ప్రిలిమ్స్‌ ఫలితాలకు మెయిన్స్‌ పరీక్షకు మధ్య కనీసం మూడు నెలల గ్యాప్‌ ఇవ్వాలని అనుకుంటున్నది. అందులో భాగంగానే మే మొదటి వారంలోనే మెయిన్స్‌ పరీక్ష నిర్వహించాలని ఆలోచిస్తున్నది.

మెయిన్స్‌కు 25,150 మంది..

గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షకు భారీగా అభ్యర్థులు పోటీ పడ్డారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పోలిస్తే ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. 503 పోస్టులకు మొత్తం 3,80,081 మంది దరఖాస్తులు చేసుకున్నారు. 2,85,916 మంది పరీక్షకు హాజరయ్యారు. తొలిసారిగా ప్రిలిమినరీ ‘కీ’తో పాటే ప్రతి ఒక్క అభ్యర్థి ఓఎంఆర్‌ షీట్‌ను వెబ్‌సైట్‌లో ఉంచింది. అయితే, గ్రూప్‌-1 ప్రిలిమినరీ నుంచి మెయిన్స్‌ పరీక్షకు 1:50 నిష్పత్తిలో ఎంపిక చేస్తామని టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ సమయంలోనే వెల్లడించింది. అంటే, 503 ఉద్యోగాలకు మొత్తం 25,150 మందిని మెయిన్స్‌కు ఎంపిక చేయనున్నారు. మల్టీజోన్‌, రిజర్వుడ్‌ వర్గాల వారీగా జాబితాను టీఎస్‌పీఎస్సీ క్షుణ్ణంగా పరిశీలించింది. మంగళ లేదా బుధవారం మరోసారి సరిచూసుకొని ప్రిలిమినరీ ఫలితాలు ఇవ్వాలని యోచిస్తున్నది. ఆ వెంటనే మెయిన్స్‌ పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించేందుకు కమిషన్‌ ప్రణాళిక సిద్ధం చేసింది. అభ్యర్థులు ఆశగా ఎదురు చూస్తున్న గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్ష తేదీపై వారం, పదిరోజుల్లోనే స్పష్టత రానున్నది.

ఆందోళన చెందొద్దు.. సమయమిస్తాం…

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాలపై అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అక్టోబర్‌ నెలలోనే ప్రిలిమ్స్‌ ఫలితాలు ఇవ్వాలని కమిషన్‌ తొలుత భావించింది. అయితే, అనుకోని ఇబ్బందులు తలెత్తడంతో కాస్త జాప్యం జరిగింది. మెయిన్స్‌ పరీక్ష గురించి అభ్యర్థులు ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. మిగిలిన పరీక్ష తేదీలను కూడా పరిగణనలోకి తీసుకుంటాం. అభ్యర్థులకు వేరే పరీక్షలు లేకుండా అన్ని విధాలా ఆలోచించి మెయిన్స్‌ పరీక్షను నిర్వహిస్తాం. ప్రిపరేషన్‌ను సైతం దృష్టిలో పెట్టుకునే మెయిన్‌ ఎగ్జామ్‌ తేదీలను ప్రకటిస్తాం. ప్రిలిమినరీ ఫలితాలు వెల్లడించిన తర్వాత మెయిన్స్‌ పరీక్షకు తప్పనిసరిగా మూడు నెలల సమయం ఇస్తాం.                                                                    

 – బీ జనార్దన్‌ రెడ్డి, టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌

1 comment:

Job Alerts and Study Materials