పీఎం రోజ్‌గార్ మేళాలో (Rozgar Mela) భాగంగా, ఉద్యోగాలకు ఎంపికైన వారికి ప్రధాని మోదీ మరోసారి అపాయిట్మెంట్ లెటర్లను అందజేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన వారికి ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) నియామక పత్రాలను అందించారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ విభాగాల్లోని పోస్టులకు (Central Government Jobs) ఎంపికైన మొత్తం 71 వేల మందికి మంగళవారం ఉదయం 10.30 గంటలకు అపాయిట్మెంట్ లెటర్లను అందించారు. వర్చువల్ విధానంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. గతంలోనూ రోజ్‌గార్ మేళా ద్వారా నియామక పత్రాలను అందించిన విషయాన్ని గుర్తు చేశారు. నియామక పత్రాలను అందుకున్న యువతను అభినందించారు. గతంలో జాబ్ అప్లికేషన్ ఫాం కోసం పెద్ద క్యూ లైన్‌లో నిలబడాల్సి వచ్చేదని ఈ సందర్భంగా మోదీ అన్నారు. ఆ అప్లికేషన్ ఫామ్ ను పోస్టు చేసేందుకు అవస్థలు పడాల్సి వచ్చేదన్నారు. దానిపై అటెస్టేషన్ కోసం గెజిటెడ్ ఉద్యోగి కోసం తిరగాల్సి వచ్చేదన్నారు. అన్ని ఇబ్బందులు పడినా చివరికి.. ఆ పోస్టు చేరాల్సిన చోటుకు చేరుతుందా? లేదా? అనే ప్రశ్న ఉండేదన్నారు. అయితే.. ఇప్పుడు ఆ పరిస్థితి మారిందన్నారు. దేశంలో లక్షలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడానికి భారీగా ఖాళీల భర్తీకి కేంద్రంలోని మోదీ సర్కార్ రోజ్ గార్ మేళా కార్యక్రమాన్ని చేపట్టింది. గ్రామీణ్ డాక్ సేవక్, పోస్టల్ ఇన్‌స్పెక్టర్, ట్రాక్ మెయింటేనర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, లోయర్ డివిజన్ క్లర్క్, సబ్ డివిజనల్ ఆఫీసర్ అండ్ ట్యాక్స్ అసిస్టెంట్, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ అకౌంట్స్ క్లర్క్ తదితర పోస్టులు ఉన్నాయి.

No comments:
Post a Comment