Mother Tongue

Read it Mother Tongue

Tuesday, 30 July 2024

భారీగా ఉద్యోగాలు.. ఆ రంగంపై స్పెషల్ ఫోకస్.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..

 కరోనా సమయంలో ఎదురైన సవాళ్లను భారత్‌ అధిగమించిన తీరును, ప్రపంచంలో బలమైన ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్న విధానాన్ని ప్రధాని మోదీ మరోసారి నొక్కిచెప్పారు. మంగళవారం కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) ఆధ్వర్యంలో విజ్ఞాన్ భవన్‌లో జరిగిన ‘జర్నీ టువర్డ్స్ వికసిత్ భారత్: ఎ పోస్ట్ యూనియన్ బడ్జెట్ 2024-25 కాన్ఫరెన్స్’ ప్రారంభ సెషన్‌లో ఆయన ప్రసంగించారు. కోట్లాది ఉద్యోగాలు సృష్టిస్తున్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (MSME) రంగంపై ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపారు.

గత దశాబ్దంలో భారతదేశంలో తయారీ రంగం ఎంతో వృద్ధి సాధించిందని, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల రంగం ఎక్కువ ఉద్యోగాలు సృష్టించిందని ప్రధాని చెప్పారు. CII పోస్ట్‌ బడ్జెట్‌ కాన్ఫరెన్స్‌లో మోదీ ప్రసంగంలోని కీలక విషయాలు చూద్దాం.

* మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలపడమే లక్ష్యం

భారతదేశంలో ఇప్పుడు 1.40 లక్షల స్టార్టప్స్ ఉన్నాయని, 8 కోట్ల మంది ప్రజలు ముద్ర రుణాలతో తమ వ్యాపారాలను ప్రారంభించారని ప్రధాని మోదీ చెప్పారు. ‘వికసిత్ భారత్’ (అభివృద్ధి చెందిన భారతదేశం) నిర్మాణానికి ప్రభుత్వ నిబద్ధతను నొక్కిచెప్పారు. ఎన్డీయే మూడో టర్మ్‌లో భారతదేశాన్ని ప్రపంచంలోని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుస్తామని మరోసారి స్పష్టం చేశారు.

* మూడు రెట్లు పెరిగిన బడ్జెట్‌

ఎన్డీఏ ప్రభుత్వం హయాంలో గడిచిన 10 ఏళ్లలో బడ్జెట్ పరిమాణం మూడు రెట్లు పెరిగి రూ.48 లక్షల కోట్లకు చేరుకుందని మోదీ పేర్కొన్నారు. మహమ్మారి వల్ల ఎదురైన సవాళ్లు ఉన్నప్పటికీ, భారతదేశ ఆర్థిక వ్యవస్థ 8% వృద్ధి నమోదు చేస్తోందని, భారతదేశం త్వరలో మొదటి మూడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. మూలధన వ్యయం ఐదు రెట్లు పెరిగిందని, గత దశాబ్దంలో రూ.11.11 లక్షల కోట్లకు చేరుకుందని వివరించారు.

‘25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారు. జీవన సౌలభ్యం, నైపుణ్యాభివృద్ధి, ఉపాధిని మెరుగుపరచడంపై దృష్టి పెట్టాం. అధిక వృద్ధి, తక్కువ ద్రవ్యోల్బణం కలిగిన ఏకైక దేశం భారతదేశం. ప్రపంచ వృద్ధికి 16% దోహదపడుతున్నాం. ప్రభుత్వం మౌలిక సదుపాయాల అభివృద్ధిలో వేగం, స్కేల్‌తో అపూర్వమైన రికార్డులను నెలకొల్పింది.’ అని పేర్కొన్నారు.

* 8 శాతం వేగంతో దేశాభివృద్ధి

అంతేకాకుండా, పన్ను రేట్లు గణనీయంగా తగ్గాయని, మంత్రిత్వ శాఖలకు కేటాయింపులు గత దశాబ్దంలో రికార్డు స్థాయిలో పెరిగాయని ప్రధాని మోదీ సూచించారు. కరోనా సమయాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ, ‘మహమ్మారి సమయంలో మేము వివిధ వర్గాలతో చర్చలు జరిపాం. ఆ చర్చల ప్రధాన ఉద్దేశం ‘వృద్ధిని తిరిగి పొందడం’. భారతదేశం అతి త్వరలో అభివృద్ధి పథంలో పరుగులు తీస్తుందని నేను అప్పుడు చెప్పాను. నేడు భారతదేశం 8% వేగంతో అభివృద్ధి చెందుతోంది.’ అన్నారు.

‘వికసిత్ భారత్’ వైపు ప్రయాణం కేవలం సెంటిమెంట్‌కు సంబంధించినది కాదని, విశ్వాసం, చర్యలకు సంబంధించినదని ప్రధాని తెలిపారు. CII పోస్ట్ బడ్జెట్ కాన్ఫరెన్స్‌లో దేశాభివృద్ధిపై ప్రభుత్వ దృష్టిని, లక్ష్యాన్ని సాధించడంలో పరిశ్రమల కీలక పాత్రను మోదీ వివరించారు.



No comments:

Post a Comment

Job Alerts and Study Materials