తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులపై స్పెషల్ ఫోకస్ పెట్టింది రేవంత్ సర్కార్. ఇప్పటికే పలు ఉద్యోగాలకు నోటిఫికెషన్స్ జారీ చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు మరో తీపికబురు చెప్పింది. తాజాగా 1,284 ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 ( Lab Technician Grade 2) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ పరిధిలో 1088 పోస్టులు, వైద్య విధానపరిషత్‌లో 183 పోస్టులు, ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రిలో 13 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ఇచ్చారు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ల్యాబొరేటరీ టెక్నీషియన్ సర్టిఫికెట్ కోర్సు/ ఎంఎల్‌టీ(ఒకేషనల్)/ ఇంటర్మీడియట్ (ఎంఎల్‌టీ ఒకేషనల్)/ బీఎస్సీ (ఎంఎల్‌టీ)/ ఎంఎస్సీ(ఎంఎల్‌టీ)/ డీఎంఎల్‌టీ/ బీఎంఎల్‌టీ/ పీజీడీ ఎంఎల్‌టీ/ బీఎస్సీ (మైక్రోబయాలజీ)/ ఎంఎస్సీ (మైక్రోబయాలజీ/ మెడికల్ బయోకెమిస్ట్రీ/ క్లినికల్ మైక్రోబయాలజీ/ బయోకెమిస్ట్రీ) ఉత్తీర్ణులై ఉండాలి.
అభ్యర్ధుల వయసు జులై 1, 2024 నాటికి 18 నుంచి 46 సంవత్సరాల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో ఈ నెల 21వ తేదీ నుంచి అక్టోబర్ 5వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష ఫీజు రూ.500 చెల్లించాలి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది.
నవంబర్ 10వ తేదీన CBT విధానంలో పరీక్ష ఉంటుంది. ఈ పోస్టులకు ఎంపికైన వారికి పోస్టును బట్టి నెలకు రూ.32,810 నుంచి రూ.1,37,050 వరకు జీతం ఇస్తారు. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన జాబ్ క్యాలెండర్‌లో భాగంగా విడుదల చేసిన తొలి నోటిఫికేషన్ ఇది అని చెప్పుకోవచ్చు.
No comments:
Post a Comment