ఉపాధ్యాయ నియామకాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం వేగంగా అడుగులేస్తోంది. మెగా డీఎస్సీ ప్రకటించి ఇప్పటికే పరీక్షలు పూర్తి చేసిన ప్రభుత్వం.. ప్రస్తుతం ఫలితాల విడుదలపై ఫోకస్ పెట్టింది. వీలైనంత త్వరలో టీచర్ నియామకాలు జరిగేలా చర్యలు తీసుకుంటోంది.
గత ప్రభుత్వం 5089 పోస్టులతో ఇచ్చిన నోఫిటికేషన్ రద్దు చేసి 11,062 పోస్టులతో కొత్త నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసి డీఎస్సీ పరీక్షలను విజయవంతంగా నిర్వహించిన గవర్నమెంట్.. తాజాగా ఫలితాల విడుదలకు సిద్ధమైంది.
డీఎస్సీ పరీక్షలు పూర్తి అయిన కొద్దిరోజుల్లోనే ప్రాథమిక కీతో పాటు రెస్పాన్స్ షీట్లను అందుబాటులోకి తీసుకొచ్చిన విద్యాశాఖ.. ఆగస్టు 20వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణ చేపట్టింది. పలువురు విద్యార్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి ఫైనల్ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నారట.
వీలైనంత త్వరలో టీచర్ ఉద్యోగాల భర్తీ చేపట్టే యోచనలో ఉన్న విద్యాశాఖ ఈ రోజు (ఆగస్టు 23) ఏ క్షణమైనా తుది ఫలితాలు (TG DSC Results 2024) వదిలే అవకాశం ఉందని సమాచారం. దీంతో పాటు అనంతరం జనరల్ ర్యాకింగ్ లిస్టు అందుబాటులోకి రానుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఆ తర్వాత 1:3 నిష్పత్తిలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ కి అభ్యర్థులను పిలవనున్నారు. తుది జాబితా ప్రక్రియ అంతా కూడా ఈ నెలాఖరులోనే పూర్తి చేయాలని విద్యాశాఖ ప్లాన్ చేస్తోందట. సెప్టెంబరు 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేయాలని రేవంత్ సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ సారి నోటిఫికేషన్ లో ఇచ్చిన మొత్తం 11,062 టీచర్ల పోస్టుల్లో 2,629 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 6,508 ఎస్జీటీ, 727 భాషా పండితులు, 182 పీఈటీలు, స్పెషల్ ఎడ్యుకేషన్ లో 220 స్కూల్ అసిస్టెంట్లు, 796 ఎస్‌జీటీ పోస్టులు ఉన్నాయి.
జులై 18వ తేదీ నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు మొత్తం 2,79,957 దరఖాస్తు చేసుకోగా 2,45,263 మంది పరీక్షకు హాజరయ్యారు. హాజరు శాతం దాదాపు 87 శాతంగా ఉంది.
No comments:
Post a Comment