Mother Tongue

Read it Mother Tongue

Monday, 5 August 2024

ఉపాధ్యాయులకు భారీ శుభవార్త.. వాటి కోసం దరఖాస్తుల ఆహ్వానం..

 డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఒక భారతీయ రాజనీతిజ్ఞుడు, తత్వవేత్త, రాజకీయవేత్త మరియు విద్యావేత్త. ఆయన భారతదేశానికి మొదటి ఉపరాష్ట్రపతిగా, రెండవ రాష్ట్రపతిగా సేవలందించారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని దేశం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటుంది.

డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ 5 సెప్టెంబర్ 1888న తమిళనాడు రాష్ట్రంలోని తిరుత్తణిలో జన్మించారు. రాధాకృష్ణన్ తన పాలనలో సంస్కృతి, విద్యకుప్రాధాన్యం ఇచ్చారు. విద్య కోసం న్యాయవాదిగా అంతర్జాతీయ వేదికపై భారతదేశానికి ప్రాతినిథ్యం వహించిన రాజనీతిజ్ఞుడిగా సర్వేపల్లి రాధాకృష్ణన్ చిరస్మరణీయులు.

విదేశాలలో భారతీయ తత్వశాస్త్రం మరియు సంస్కృతిపై జ్ఞానాన్ని పెంపొందించడానికి అతని చొరవలు దీర్ఘకాలిక ప్రభావాలు చూపాయి. అయితే భారతదేశంలోని ఇతర ప్రాంతాల్లోని తరాల విద్యావేత్తలు, ఉపాధ్యాయులు, నాయకులు ఇప్పటికీ ఈయన అడుగుజాడల్లోనే నడుస్తున్నారు.

సెప్టెంబర్ 5న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు అందజేయనున్నారు. ఈ మేరకు హనుమకొండ జిల్లా విద్యాశాఖ అధికారి ఎండి అబ్దుల్ హై ఒక ప్రకటనలో తెలిపారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులను అందజేస్తామని పేర్కొన్నారు.

ఇందుకు జిల్లాకు చెందిన ఉత్తమ ఉపాధ్యాయులు అవార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు ఇందుకు అర్హులన్నారు. కనీసం 15 ఏళ్ల అనుభవం కలిగి ఉండాలని చెప్పారు. అయితే గతంలో ఉపాధ్యాయులు తమ సర్వీస్ లో ఎలాంటి క్రమశిక్షణ చర్యలు ఉండకూడదని తెలిపారు. ఆసక్తి, అర్హత కలిగిన ఉపాధ్యాయులు ఇందుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

ఉపాధ్యాయులు తమ మండలాల్లోని ఎంఈఓ కార్యాలయాల్లో ఆగస్టు 16వ తేదీలోగా దరఖాస్తులు అందజేయాలన్నారు. ఇందులో ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసి సెప్టెంబర్ 5న వారికి అవార్డులు అందజేస్తామన్నారు. పూర్తి వివరాలకు ఎంఈఓ కార్యాలయాల్లో నేరుగా సంప్రదించవచ్చన్నారు. జిల్లాకు చెందిన ఉపాధ్యాయులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.



No comments:

Post a Comment

Job Alerts and Study Materials