దేశంలోనే అత్యంత ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తూ, నిత్యం కోట్లాది మంది ప్రయాణికులను గమ్య స్థానాలకు చేరుస్తున్న భారతీయ రైల్వేలో ఉద్యోగం సాధించాలనేది ఎంతో మంది కల. అందుకే, రైల్వే ఉద్యోగమే లక్ష్యంగా ఏటా లక్షలాది మంది యువత సన్నద్ధమవుతుంటారు. కొన్ని వందలు, వేల ఖాళీలకు లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటారు. చివరికి కొద్దిమందికే ఉద్యోగాలు వస్తుంటాయి. అయితే ఇకపై ఈ పరిస్థితి మారనుంది. ఇండియన్ రైల్వేస్ త్వరలో జాబ్ క్యాలెండర్‌ను రిలీజ్ చేయనుంది. దీంతో పోస్టుల సంఖ్యపై, ఏ ఉద్యోగానికి ప్రిపేర్ అవ్వాలనే దానిపై నిరుద్యోగులకు క్లారిటీ రానుంది.
రైల్వే ఉద్యోగాలకు పోటీని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ జాబ్ క్యాలెండర్‌ను సిద్ధం చేసిందని, దాన్ని త్వరలో ప్రకటిస్తామని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు.
రైల్వే మంత్రి ప్రకటన
అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, “ఏటా క్రమం తప్పకుండా జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నాం. జనవరి నుంచి డిసెంబర్ వరకు నాలుగు త్రైమాసికాల్లో ఒక్కో కేటగిరీకి సంబంధించిన పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేస్తాం. జనవరి నుంచి మార్చి వరకు మొదటి త్రైమాసికంలో లోకో పైలట్ల నియామకం, రెండో త్రైమాసికంలో టెక్నీషియన్లు, జూనియర్ ఇంజినీర్ల నియామకం, మూడో త్రైమాసికంలో నాన్ టెక్నికల్ సిబ్బంది, నాలుగో త్రైమాసికంలో లెవల్-1 అధికారుల భర్తీకి క్రమం తప్పకుండా నోటిఫికేషన్ విడుదల చేస్తాం.
ఇలా ప్రతి త్రైమాసికంలో వివిధ పోస్టుల కోసం ఖాళీలను ప్రకటిస్తాం. రిక్రూట్‌మెంట్ క్యాలెండర్‌లోనే దరఖాస్తు తేదీలు, పరీక్ష తేదీలను పేర్కొంటాం. అందుకు అనుగుణంగా అభ్యర్థులు సన్నద్ధం కావచ్చు.” అని పేర్కొన్నారు.
రైల్వే ప్రమాదాలపై రాజకీయాలు చేయొద్దు..
ఇటీవల తరచూ జరుగుతున్న రైలు ప్రమాదాలపై ఎన్‌డీఏ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లవెత్తాయి. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు అశ్విని వైష్ణవ్ సమాధానమిస్తూ.. ‘భారతీయ రైల్వే దేశానికి జీవనాడి లాంటిది. ప్రతిపక్షాలు రైల్వే ప్రమాదాలపై ఎటువంటి రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలు చేయకూడదని కోరుతున్నాను. ఆయా సంఘటనలలో సిబ్బంది నిర్లక్ష్యంపై విచారణ జరుపుతున్నాం. వాస్తవాలు త్వరలోనే బయటికొస్తాయి. రైల్వే, రక్షణ రంగాలు దేశ భద్రతలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. నిత్యం కోట్లాదిమంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తున్న రైల్వే సేవలను అందరూ హర్షించాలని, సేవలను సమర్థవంతంగా నిర్వహించేలా ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని కోరుతున్నాను.’ అని అశ్విని వైష్ణవ్ అన్నారు.
వచ్చే ఐదేళ్లలో రైల్వే ప్రాజెక్టులన్నీ పూర్తి..
గతేడాది కాలంలో 5,300 కి.మీ మేర కొత్త రైల్వే లైన్లు వేశామని రైల్వే మంత్రి చెప్పారు. 10 సంవత్సరాల క్రితం రైల్వేలో సగటున రోజుకు నాలుగు కిలోమీటర్ల వేగంతో నిర్మాణాలు జరిగేవని, ప్రస్తుతం అది రోజుకు 14.5 కిలోమీటర్ల మేర అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు. రైల్వేల ఆధునికీకరణకు, ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని గుర్తు చేశారు. ఇప్పటికే ఆమోదం పొందిన రైల్వే ప్రాజెక్టులన్నీ వచ్చే ఐదేళ్లలో పూర్తి చేయనున్నట్లు స్పష్టం చేశారు.
No comments:
Post a Comment