Mother Tongue

Read it Mother Tongue

Friday, 9 August 2024

మహిళలకు అదిరే శుభవార్త.. మీ కోసమే 11 వేల అంగన్‌వాడీ ఉద్యోగాలు

 మ‌హిళ‌ల‌ కోసం మ‌రో భారీ ఉద్యోగ నోటిఫికేష‌న్ ఇవ్వడానికి రెడీ అయింది తెలంగాణ సర్కార్. ఆ వివరాలు చూద్దామా..

తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న రేవంత్ సర్కార్.. ప్రజా సంక్షేమంతో పాటు నిరుద్యోగ సమస్యపై ప్రధానంగా దృష్టి పెట్టింది. ఇప్పటికే మెగా DSC పరీక్షలు నిర్వహించడమే గాక పలు శాఖల్లో ఉద్యోగాల భర్తీ చేసిన ప్రభుత్వం.. తాజాగా నిరుద్యోగులు పండగ చేసుకునే మరో అప్‌డేట్ ఇచ్చింది.

ముఖ్యంగా మ‌హిళ‌ల‌ కోసం మ‌రో భారీ ఉద్యోగ నోటిఫికేష‌న్ ఇవ్వడానికి రెడీ అయింది తెలంగాణ సర్కార్. రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ ఉపాధ్యాయ, సహాయకుల పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం రెడీ అయింది.

రాష్ట్ర వ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 11 వేల ఉద్యోగాలను త్వరలోనే భర్తీ చేయబోతున్నట్లు పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపింది. 15 వేల అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్లే స్కూల్స్ ప్రారంభిస్తామని చెప్పింది.

కాగా.. ఇప్పటికే అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల సంఖ్యను గుర్తించింది ప్రభుత్వం. ఈ పోస్టులను భర్తీ చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ప్రభుత్వ అనుమతులు రాగానే జిల్లాల వారీగా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఉద్యోగ ప్రకటనలు విడుదల కానున్నాయి.

తెలంగాణలో మొత్తం 35,700 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా.. ఇందులోని ఒక్కో కేంద్రంలో ఉపాధ్యాయురాలితో పాటు సహాయకురాలు ఉంటారు. అయితే ఈ పోస్టులు చాలా వరకు ఖాళీగా ఉండటంతో వీటి భర్తీకి సిద్ధమవుతోంది రేవంత్ సర్కార్.

మరోవైపు రాష్ట్రంలోని నిరుద్యోగుల కోసం ఇప్పటికే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది ప్రభుత్వం. ఉద్యోగార్థులు ఓ ప్రణాళిక ప్రకారం చదువుకునేలా జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇందులో పొందుపర్చారు.

ఏ నిరుద్యోగ సమస్య అయితే తెలంగాణ ఆకాంక్షకు బలమైన కారణమైందో ఆ సమస్యను పరిష్కరించే దిశగా స్పష్టమైన జాబ్ క్యాలండర్‌ను ప్రకటించబోతున్నామని స్పష్టం చేసిన సీఎం.. ఇటీవలే ఆ హామీ నెరవేర్చారు. కాగా జాబ్‌ క్యాలెండర్‌ ద్వారా రాబోయే రోజుల్లో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది.



8 comments:

Job Alerts and Study Materials