దేశంలోని వివిధ రంగాల్లో అందుబాటులో ఉన్న ఉపాధి అవకాశాలు,కెరీర్ కౌన్సెలింగ్, వొకేషనల్ గైడెన్స్, స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులు, ఇంటర్న్‌షిప్స్ వంటి సమాచారం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ కెరీర్ సర్వీస్ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా ఎన్నో కంపెనీలు ఈ పోర్టల్‌లో రిజిస్టర్ అయ్యాయి. ఈ కంపెనీలు ఎప్పటికప్పుడు ఉద్యోగ ఖాళీలు, ఇంటర్న్‌షిప్ వివరాలను ఎన్‌సీఎస్ పోర్టల్‌లో పొందుపరుస్తాయి. తద్వారా ఇప్పటికే ఎంతో మంది యువకులు ఉద్యోగాలు పొందారు. తాజాగా ఈ పోర్టల్ సరికొత్త రికార్డ్ సృష్టించింది. నేషనల్ కెరీర్ సర్వీస్ పోర్టల్‌లో 2022-23 సమయంలో 35.7 లక్షల ఉద్యోగ ఖాళీలు రిజిస్టర్ అయ్యాయి. పోర్టల్ ప్రారంభించినప్పటి నుంచి ఈ స్థాయిలో ఖాళీలు రిజిస్టర్ కావడం ఇదే తొలిసారి అని కేంద్ర కార్మిక శాఖ వెల్లడించింది. ఎన్‌సీఎస్‌లో రిజిస్టర్ అయిన అన్ని కంపెనీలను కలుపుకుంటే 2022-23లో మొత్తం 35.7 లక్షల ఖాళీలు ఉన్నాయి. ఇక 2021-22లో కేవలం 13 లక్షల ఖాళీలు ఉండడం గమనార్హం. 2021-22తో పోలిస్తే NCSలో ఖాళీల రిపోర్టింగ్ 2022-23లో 175 శాతం పెరిగింది. 2022-23లో ఎన్‌సీఎస్ పోర్టల్ మరో రికార్డ్‌ను సొంతం చేసుకుంది. 2022 అక్టోబర్ 30న 5.3 లక్షల కంటే ఎక్కువ యాక్టివ్ ఖాళీలను నమోదు చేసింది. NCSలో ఖాళీల పోస్టింగ్‌లో పెరుగుదల అన్ని రంగాలలో కనిపిస్తోంది. 2021-22లో ఫైనాన్స్ అండ్ ఇన్సూరెన్స్ రంగంలో 2.2 లక్షల ఖాళీలు ఉండగా, 2022-23లో దాదాపు 20.8 లక్షల ఖాళీలను నమోదు చేసింది. ఆ లెక్కన ఫైనాన్స్ అండ్ ఇన్సూరెన్స్ రంగం ప్రస్తుతం 800 శాతానికి పైగా అసాధారణ వృద్ధిని కనబరిచింది. ఆపరేషన్స్ అండ్ సపోర్ట్ రంగంలోని ఖాళీలు కూడా 400 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ఈ రంగంలో 2021-22లో 76 వేల ఖాళీలు ఉండగా, 2022-23లో 3.75 లక్షల ఖాళీలు నమోదయ్యాయి. ఇతర రంగాలైన హోటళ్లు, ఫుడ్ సర్వీస్ అండ్ క్యాటరింగ్, తయారీ, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ రంగాల్లో ఖాళీలు మునుపటి సంవత్సరం కంటే 2022-23లో గణనీయమైన పెరుగుదల కనిపిస్తోంది.
No comments:
Post a Comment